ప్రజా ప్రతినిధులారా మీ యజమాని ఎవరు?

ప్రజాప్రతినిధులు- తమను తాము సర్వసత్తాక సార్వభౌములుగా ఊహించుకుంటున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా.. తమను తాము యజమానులుగా తలపోస్తున్నారు.

తరం మారుతున్న కొద్దీ ఆలోచన సరళి కూడా మారుతుండడం సహజం. ఒక పార్టీ ని విడిచిపెట్టి.. మరొక పార్టీలో చేరే నాయకులు, పాత రోజుల్లో, అలాంటి పని చేయడానికి సిగ్గుపడేవారు. తర్వాతి తరంలో మొహమాటపడడం ప్రారంభించారు. ఆ తర్వాత సమర్థించుకోవడం తయారైంది. ప్రస్తుతం అలాంటి సిగ్గుమాలిన పనులకు వంచనతో కూడిన ఒక మాటల ముసుగు తొడుగుతున్నారు. కాల మహిమ అని సరిపెట్టుకోలేం. ఎందుకంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు నెలవైన మన దేశంలో.. ప్రజల తీర్పు అనేది విచ్చలవిడిగా అత్యాచారానికి గురవుతున్న సందర్భాలే ఈ ఫిరాయింపులు. ఫిరాయింపులతో ముడిపడి అనేకానేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రజాప్రతినిధులు- తమను తాము సర్వసత్తాక సార్వభౌములుగా ఊహించుకుంటున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా.. తమను తాము యజమానులుగా తలపోస్తున్నారు. తలబిరుసుగా వ్యవహరిస్తున్నారు. తగాదాలు పడుతున్నారు. తొడలు చరుస్తున్నారు. రంకెలు వేస్తున్నారు. రెచ్చిపోతున్నారు. వీరిపోకడలు.. ప్రజాస్వామ్య కల్పవృక్షానికి విష పురుగుల్లా పరిణమిస్తున్నాయి. ఈ వ్యవహారాల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ప్రజాప్రతినిధులారా మీ యజమాని ఎవరు?

పార్టీ మారడం అనేది తప్పు కానేకాదు. వ్యక్తుల విశ్వాసాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం చాలా సహజం. సామాజిక అంశాల మీద మన అవగాహన కూడా కాలం గడుస్తున్న కొద్దీ విస్తృతం అవుతూ ఉంటుంది. జ్ఞానం కొత్త మొగ్గలు తొడుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ప్రస్తుతం ఉన్న పార్టీకంటె మరొక పార్టీ మెరుగైనదని అనిపించడంలో వింతేముంది. ఆ రకంగా ఎన్ని పార్టీలు, ఎన్నిసార్లు మారినా తప్పు లేదు. కానీ ఆ మార్పులకు అనగా ఫిరాయింపులకు హేతుభూతంగా ఉండవలసినది ఏమిటి? జ్ఞానం, సిద్ధాంత బలం, సామాజిక స్పృహ.. ఇత్యాది అంశాలు. రాజకీయం అనేది భ్రష్టు పట్టిపోయిన తరువాత.. అంటే మొన్నమొన్నటివరకు కూడా.. స్వార్థం, ప్రలోభాలు, అవకాశవాదం ఫిరాయింపుల్ని పురిగొల్పాయి.

ఇప్పుడు అంతకంటె ఒక మెట్టు దిగింది ఈ వైఖరి. వీటితో పాటు ‘అధికారంలో ఉన్న పార్టీ’ అనే పదం కీలకం అయిపోయింది. బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లాగా, కాంతిదీపం చుట్టూ ఎగిరెగిరి నశించిపోయే శలభాల్లాగా నాయకులు అనేక మంది పార్టీలు అటు ఇటు మారుతూ వస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. కానీ ఫిరాయిస్తున్న వారిలో భయం లేదు. ఎందుకంటే.. అధికారం మరో పార్టీ చేతిలోకి మారినంత మాత్రాన వారికి వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే అప్పుడు మరోసారి పార్టీ మారడానికి ఏమాత్రం సిగ్గుపడని బ్యాచ్ వారిది అని మనం తెలుసుకోవాలి.

పార్టీల వైకల్యం : ఫిరాయింపుల మొదటి కారణం

ఇప్పుడున్నవి చాలా వరకు అంగవైకల్యంతో కూడిన పార్టీలు. వ్యక్తుల విషయంలో అయితే వైకల్యాన్ని చులకనగా ప్రస్తావించకుండా.. దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు అనే రకరకాల పదాలను మనం తయారు చేసుకుంటాం. కానీ ఇవి రాజకీయ పార్టీలు- అంగవైకల్యం ఉన్నవని అనడమే కరెక్టు.

ఒక్కొక్క పార్టీ ఒక్కోరకమైన , ఒక్కో స్థాయిలోని వైకల్యంతో బాధపడుతూ ఉంటుంది. కొన్ని పార్టీలు పుట్టడమే వైకల్యంతో పుడుతున్నాయి. అలాగని.. మిగిలిన పార్టీల్లో వైకల్యమే లేదని కాదు. ఎంతో పురాతన పార్టీలు అయినప్పటికీ కూడా.. పుట్టినప్పుడు సంపూర్ణారోగ్యంతో వర్ధిల్లినవే అయినప్పటికీ కూడా.. ఆ తర్వాతి కాలంలో కొత్త వైకల్యాల్ని సంతరించుకున్న పార్టీలు ఇవి.

మనుషుల్లో కాలులోపం, కన్నులోపం ఉన్నట్టుగా.. ఈ రాజకీయ పార్టీల్లో సిద్ధాంత లోపం ఉంది. కొన్నింటి పుట్టుకలో సిద్ధాంత బలం పుష్కలంగా ఉన్నవే అయినప్పటికీ.. కాలక్రమంలో అనేక యాక్సిడెంట్లు, సర్జరీలు జరిగి వైకల్యంతో కుములుతున్న పార్టీలు!

సిద్ధాంతబలం కాపాడుకుంటూ ఉన్న పార్టీలకు ఫిరాయింపుల భయం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ఆ పార్టీలో చేరేవారు, కొనసాగుతున్న వారు అంతా కూడా.. ఆ సిద్ధాంతాలను విశ్వసించడం వల్ల మాత్రమే ఆ పార్టీలోకి వస్తారు. అదే తరహా సిద్దాంతాలతో మరో పార్టీ వారికి కనిపించడం అనేది అసాధ్యమైన రాజకీయ వాతావరణం ఇది.

ఇలాంటి నేపథ్యంలో.. సిద్ధాంతాలను నమ్మేవాళ్లు పదిలంగా అదే పార్టీలో ఉంటారు. ఈలోగా.. సిద్ధాంతాలకు కాకపోయినా.. పార్టీల ఆస్తులకు, వ్యాపారాలకు వారసులు తెరపైకి వస్తారు. వచ్చిన నాటినుంచి పార్టీ యజమానుల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ తమ లబ్ధిని, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఫిరాయింపుల బాటలను అనుసరిస్తుంటారు. లేకపోతే, ఆ సిద్ధాంతాల గొడుగుకిందనే ఉంటూ తమ తమ జీవితాలను కొనసాగిస్తుంటారు. సిద్ధాంత బలం లేని పార్టీలు అయితే.. నాయకులది గాలివాటు ధోరణి.

నయా ఆత్మవంచన : ప్రజలకోసం, ప్రగతి కోసం

పార్టీలు ఫిరాయించిన నాయకులు మరో పార్టీలో చేరిన ప్రతి సందర్భంలోనూ వారుచెప్పే మాట ఒక్కటే. ‘ప్రజల మనోభిప్రాయం మేరకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాం’ అని! రాజకీయ నాయకుల యొక్క ఆత్మవంచనతో కూడిన మాటలకు ఇది పరాకాష్ట.

రాజకీయ నాయకులు ఎందుకు పార్టీ మారుతున్నారనే సంగతి అందరికీ తెలుసు. పార్టీ మారిన తర్వాత, అంతకుముందు సదరు నాయకుడి వ్యవహార సరళి ఎలా మారిపోతుంటుందో కూడా ప్రజలు గుర్తిస్తుంటారు. ‘సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్’ అని శతకకారుడు చెప్పిన చందంగా.. పార్టీ ఫిరాయించిన తర్వాత.. ఆయా నాయకుల సంపదలు ఎలా పెరిగిపోతుంటాయో కూడా ప్రజలందరికీ తెలుసు.

నాయకులు చెప్పుకునే ఆత్మవంచన మాటల్లో నియోజకవర్గ ప్రజల మనోభిప్రాయం మేరకు పార్టీ మారుతున్నట్టుగా సెలవివ్వడం ఒక వంచన! ఉదాహరణకు లక్ష మంది ఓట్లతో నెగ్గిన ఒక నాయకుడు.. ఎంత మంది ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని.. ఫిరాయింపు నిర్ణయానికి వచ్చి ఉంటాడు. నికరంగా చెప్పగల ధైర్యం మాత్రం ఉండదు.

రాద్ధాంతాలు

రెండు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పార్టీల మధ్య ఫిరాయింపులు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణలో శాసనసభ్యుల ఫిరాయింపులు చాలా పెద్ద ఎత్తున చోటు చేసుకుంటూ ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపుగా అన్నీ స్థానిక సంస్థలు అధికార కూటమి పరం అయ్యే విధంగా ఫిరాయింపులు జరుగుతున్నాయి.

ఈ రెండు కేటగిరీలలో.. శాసనసభ్యుల రాజీనామాలు ఆ పార్టీకి పెద్ద దెబ్బ కనుక తెలంగాణలో సీరియస్ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆరికపూడి గాంధీ ఫిరాయింపు వ్యవహారం చాలా తీవ్రమైన వివాదానికి దారితీస్తుండడం విశేషం. ఆరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని కట్టపెట్టింది. అసలే ఫిరాయింపులు కోర్టు ఎదుట నడుస్తుండగా ఇది భారత రాష్ట్ర సమితి పార్టీకి పుండు మీద కారం రాజేసింది.

గాంధీ ఇంటికి వెళ్లి గాజులు చేరవేస్తానని కౌశిక్ రెడ్డి అనడం. చెప్పిన సమయానికి ఆయన రాకపోగా గాంధీ స్వయంగా ఆయన ఇంటికి ధర్నా చేయడం నుండి వ్యవహారాలు జరిగాయి. తెలంగాణ అంతా కాంగ్రెస్ లోకి జరుగుతున్న ఫిరాయింపుల మీద రచ్చ రచ్చ అవుతుంది. అయితే తమాషా ఏమిటంటే గాంధీ తీసుకున్న నిర్ణయం పట్ల మహా ఐతే కేసిఆర్ గట్టిగా స్పందించాలి. అంతే తప్ప పాడి కౌశిక్ రెడ్డికి హఠాత్తుగా అంత విలువ ఎలా వచ్చింది? ఇది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న! ఇంచుమించుగా తానే పార్టీ యజమాని అయిన రీతిలో కౌశిక్ రెడ్డి గాంధీకి హెచ్చరికలు జారీచేశారు.

సాధారణంగా ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పదవి దక్కాలి. రేవంత్ సర్కారు అదే కోటాలో ఆయనకు పదవి ఇచ్చింది. కానీ ఆయన భారాస తరఫున గెలిచి, కాంగ్రెసులోకి మారిపోయారు గనుక.. ఆ పదవి దక్కకూడదని వీరి కోరిక. కేసీఆర్ ‘ఇలాంటి వాటికి స్పందించడం తన స్థాయి కాదు’ అనుకుంటూ రోజులు వెళ్లదీస్తుంటారు గనుక.. కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లు తెరపైకి వస్తున్నారు. రచ్చరచ్చ చేస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు తమ పార్టీ యొక్క ఆస్తి, సొత్తు అని పార్టీలు అనుకుంటూ ఉండడం వల్ల ఇలాంటి పరిణామలు వస్తుంటాయి.

నిజమేనా! ప్రజాప్రతినిధులకు యజమానులు పార్టీలేనా? అనేది చాలా పెద్దసందేహం. అందుకే తమ ఆస్తి తమకు కావాలని వారు కోర్టులో దావాలు నడుపుతున్నారు. భారాస పిటిషన్ ఇలాంటిదే.

ఇంతకూ యజమాని ఎవరు?

చట్టసభలకు దాదాపు లక్షన్నర మంది ఓటర్ల దయతో గెలిచిన వ్యక్తి.. ఒక రాజకీయ పార్టీకి ఆస్తి ఎలా అవుతాడు? అతను ప్రజల ఆస్తి. నిజంగా ప్రజాభిప్రాయాల మేరకు పార్టీ మారితే తప్పులేదు. కానీ.. పార్టీలు మారిన తర్వాత కూడా భారాస నాయకులు గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు.

అయితే ప్రతినిధులు మాత్రం.. ప్రజలే తమకు దేవుళ్లు అని మాత్రమే కాదు. ప్రజలు తమకు యజమానులు అనే స్పృహను కలిగి ఉండాలి. ఆ మాటకొస్తే.. పార్టీ మారిన వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు, కేసులు పోరాటాలు నడుపుతున్న భారాస.. కనీసం పార్టీ మారిన నాయకుల మీద నియోజకవర్గంలో లోకల్ గా ప్రజల మద్దతును కూడగట్టలేకపోతోంది.

మన ప్రతినిధులకు యజమానులు ప్రజలే. ఆ స్పృహ అందరిలో ఉండాలి. ప్రజల్లోనేకాదు.. నాయకుల్లో కూడా ఉండాలి. ప్రజలతో మమేకం అవుతూ వారి సేవలో నిత్యం ఉంటే సరిపోతుంది. ఎవరైనా పార్టీ మారితే.. ప్రజలు పరవాలేదని క్షమించవచ్చు. కానీ పార్టీ యాజమాన్యాలు క్షమించేలా లేవు. అందుకే కేసులు నడుపుతున్నారు.

ప్రజాప్రతినిధులు ప్రతిసారీ తమ పార్టీల మీద విమర్శలు చేసి పార్టీ మారుతుంటారు. అసలు పార్టీల ఊసులు వదిలేసి.. ఇతర కారణాల మీద మాత్రమే పార్టీలు మారడం మొదలెడితే.. కొంతలో కొంత ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుంది.

.. ఎల్ విజయలక్ష్మి

16 Replies to “ప్రజా ప్రతినిధులారా మీ యజమాని ఎవరు?”

  1. ఇక్కడ రాసెవారికి కనీసం కొంచం అన్న రాజకీయ అవగాహన ఉండాలి.

    ప్రజప్రతినిదులకి యజమానులు అంటూ ఉండరు! అలా అనుకొనె, జగన్ అప్పత్లొ నెనె శాశ్వత అద్యక్షుడని అని చెప్పుకొని బంగ పడ్డాడు!

    పార్టి పిరాయింపులు సమర్దించటం లెదు. అయిథె టికెట్ ఇచ్చిన పార్టికీ అదినాయకుడికి (మీ భషలొ యజమాని) ఒక బానిసలా, ఒక కట్టపలా ఎ స్వతంత్రం లెకుండా పని చెయల్సిన అవసరం లెదు.

  2. Actress Jatwani: ఏపీలో దారుణం.. పోలీసులే నగ్నంగా వీడియో తీసి.. నటికి 45 రోజులు నరకం

    నటి జెత్వానీ లైగింక వేధింపుల కేసులో భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. వైసీపీ బడా నేతలు, పోలీస్ అధికారులు తనకు 45 రోజులపాటు నరకం చూపించారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. బట్టల్లేకుండా వీడియో తీసి తన ఫ్యామిలీని టార్చర్‌ చేశారని ఆరోపించింది.

    rtvlive.com/actress-jetwani-was-sexually-harassment-by-the-ap-police-telugu-news/

  3. సిద్ధ పార్టీ మారే దాకా. రైడ్ లు చేసారు. J C ni వేధించారు. అయ్యన్న కు పార్టీ చేంజ్ ఆఫర్ ఇచ్చారు . ఎందరిని బెదిరించి దారికి తేవాలని చూసారు కానీ కొందరు మార లేదు .గూటి పాటు కి 400 కోట్ల ఫెయిన్ వేశారు .

  4. ప్రజా ప్రతినిధులు ప్రజల బానిసలలా ఉండాలి కానీ పార్టీల బానిసలలా మారకూడదు.

    ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాయి.

    ప్రజల్లో విభజన వాదం రెచ్చగొట్టేవి కొన్ని, కేరాఫ్ పలానా వ్యక్తి పార్టీలు కొన్ని.

    వీటికి సిద్ధాంతము, దేశ ప్రగతి మీద అవగాహన ఉండదు.

    అక్రమ సంపాదన మీద ధ్యాస తప్ప.

Comments are closed.