కేవలం సీఎంను కలిస్తే పదవులు ఎలా తీసుకున్నారు?

బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెసు పార్టీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.

బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెసు పార్టీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే భయంతో వణికిపోతున్న ఫిరాయింపుదారులు ఒకరొకరే సుప్రీం కోర్టుకు అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. దాదాపు అందరూ ఒకేవిధమైన వివరణ ఇస్తున్నారని సమాచారం.

అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు జరుగుతాయి కదా. అందుకే ఆ వేటు నుంచి తప్పించుకోవడానికి తాము కాంగ్రెసు పార్టీలో చేరలేదని, ఇప్పటికీ బీఆర్​ఎస్​ పార్టీలోనే ఉన్నామని అఫిడవిట్లలో చెబుతున్నారు. కాని ఎమ్మెల్యేల వివరణ మరీ స్కూలు పిల్లల వివరణ మాదిరిగా ఉంది. వీరిపై అనర్హత వేటు వేయించాలని, ఉప ఎన్నికల్లో శంకరగిరిమాన్యాలు పట్టించాలని, దాని ద్వారా కాంగ్రెసు పరువు తీయాలని పట్టుదలగా ఉన్న బీఆర్​ఎస్​ ఈ వ్యవహారాన్ని అంత తొందరగా వదిలిపెట్టదు.

ఈపాటికి పకడ్బందీగా సాక్ష్యాలన్నీ సేకరించి ఉంటుంది. ఫిరాయింపుదారులు తాము కేవలం సీఎంను కలిశామని, తాము కాంగ్రెసులో చేరినట్లు మీడియా వక్రీకరించిందని అఫిడివిట్లలో చెబితే సరిపోయిందా? కాంగ్రెసు పార్టీ కండువాలు కప్పుకున్నట్లుగా ఫోటో, వీడియో సాక్ష్యలున్నాయి. ఇవీ కాకుండా పోచారం శ్రీనివాస రెడ్డి, ఆరికెపూడి గాంధీ పదవులు పొందారు. పోచారం వ్యవసాయ సలహాదారుగా ఉన్నారు. గాంధీ పీఏసీ చైర్మన్​గా ఉన్నారు. దానం నాగేందర్​ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెసు తరపున పోటీ చేశాడు. ఓడిపోయాడనుకోండి అది వేరే సంగతి.

కేవలం సీఎంను కలిస్తే పదవులు ఎలా తీసుకున్నారు? పార్లమెంటు ఎన్నికల్లో ఎలా పోటీ చేశాడు? ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చాయి. కాబట్టి మీడియా వక్రీకరించిందని బుకాయించడానికి అవకాశమే లేదు. టీవీ ఛానెళ్లు కుప్పలు తెప్పలుగా వచ్చాక మీడియా వక్రీకరించింది అనేందుకు ఆస్కారమే లేదు. కాబట్టి అఫిడవిట్లు ఇచ్చే ఎమ్మెల్యేలకు ఇవన్నీ గుర్తులేవనుకోవాలా? ఈసారి సుప్రీం కోర్టు కూడా చాలా సీరియస్​గా ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా బీఆర్‌ఎస్‌లా ఫిరాయింపులకు పాల్పడలేదు. మొట్టమొదటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్మల్‌ నియోజకవర్గం నుంచి బీఎస్‌పీ ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రకరణ్‌ రెడ్డి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజకవర్గం బీఎస్‌పీ ఎమ్మెల్యే కొనేరు కొనప్పను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ఫిరాయింపులకు నాంది పలికారు. టీడీపీ తరపున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చి, టీడీపీ పార్టీని తెలంగాణలో లేకుండా చేశారు.

2014 నుంచి 2018 వరకు నలుగురు ఎంపీలు, 25 ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు మొత్తం 47 మంది అధికార ప్రతినిధులను తన పార్టీలో చేర్చుకుని రాజకీయ పదవులను కట్టబెట్టారు. రెండోసారి సంపూర్ణ మెజార్టీతో 88మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిచినా ప్రతిపక్ష హోదా కాంగ్రెస్‌ పార్టీకి ఉండకూడదన్న అహంకార ధోరణితో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలను రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా ప్రొత్సహించారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లు వచ్చినా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను నయానో భయానో తన పార్టీలో చేరేలా ఫిరాయింపులు చేపట్టారు. ఇదంతా గతం. మరి ఇప్పడు సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

4 Replies to “కేవలం సీఎంను కలిస్తే పదవులు ఎలా తీసుకున్నారు?”

  1. టిడిపి ఎమ్మెల్యే గా ఉన్న కొడాలి నాని, ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు గా ఉన్న శోభా నాగిరెడ్డి, అనిల్ రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీ మారలేదా..

Comments are closed.