తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ సర్వే నివేదికపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సహజంగానే వాద ప్రతివాదాలు.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో జరిగాయి. ఒకరినొకరు తిట్టిపోసుకోవడానికి అగ్రప్రాధాన్యం ఇచ్చారు. మొత్తానికి తెలంగాణలో 56 శాతం బీసీలు ఉన్నట్లుగా కులగణన సర్వే తేల్చినట్టుగా ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు.
తెలంగాణలో బీసీల జనాభా పెరిగిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ, భారాస, మజ్లిస్ పార్టీలు కూడా సర్వే నివేదిక విషయంలో అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారం మొత్తం పక్కన పెడితే.. ఒక్క విషయంలో మాత్రం.. శాసనసభా ముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాలు విసిరారు. తెలంగాణ రాజకీయ పార్టీల్లో ఆ సవాలు స్వీకరించే ధైర్యం ఎవరికుందా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.
ఇంతకూ బీసీలకు స్థానికసంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించడం గురించి కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చింది. గెలిచినప్పటి నుంచి అందరూ ఆ హామీ గురించి యాగీ చేస్తున్నారు. కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని అంటున్నారు.
రేవంత్ రెడ్డి కులగణన మీద నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ.. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అనే హామీకి కాంగ్రెసు కట్టుబడి ఉందని.. అయితే చట్టబద్ధంగా ఆ రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి.. అది తమ చేతిలో వ్యవహారం కాదు కాబట్టి.. పార్టీ పరంగా కాంగ్రెస్ తరఫున స్థానిక ఎన్నికల్లో 42 శాతం సీట్లు బీసీలకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. ఈ మేరకు తమ పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కూడా చర్చించి వెల్లడిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
భారాస, భాజపా పార్టీల్లో ఎవ్వరికైనా సరే.. ఈ సవాలును స్వీకరించే ధైర్యముందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చట్టబద్ధంగా అవకాశం కల్పించేదాకా ఆగడం ఎందుకు.. ఇప్పుడే ఈ ఎన్నికల్లోనే తమ పార్టీ 42 శాతం బీసీలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా రేవంత్ చెబుతున్నారు. నిజానికి ఇది మంచి ఏర్పాటు. 42 శాతం సీట్లు అనే న్యాయం ఎటూ జరుగుతుంది. అయితే ఇలాంటి సవాలును స్వీకరించడానికి భారాస, భాజపా సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది చర్చ.
భారాసలో బీసీల హవా తక్కువ. బిజెపి కూడా బీసీనీ ప్రధానమంత్రిని చేసిన పార్టీ మాది అని చెప్పుకుంటుంది గానీ.. విషయానికి వచ్చి స్థానిక సంస్థల్లో 42 శాతం సీట్లు బీసీలకు ఇస్తుందో లేదో చెప్పదు. వారు కూడా ఈ సవాలును స్వీకరిస్తే.. ఎటూ బీసీలకు న్యాయం జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Nine, zero, one, nine, four, seven, one, one, nine, nine, nvc
Nine, nine, eight, nine, zero, six, four, two, five, five :- CB work